న్యూఢిల్లీ : ఐక్య రాజ్య సమితి(ఐరాస) కొత్త ప్రపంచ పటంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసిది. ఐరాస ప్రతిపాదన ఏదైనా నిర్దిష్ట పటాన్ని గుర్తించినట్టు కాదని భారత విదేశాంగ శాఖ ఆదివారం తెలిపింది. ఆ ప్రతిపాదనలో దేశాల సరిహద్దులు, వివాదాస్పద ప్రాంతాలు లేదా వాటి పేర్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదంది. ప్రతి దేశ వైశాల్యం దాని వాస్తవ పరిమాణానికి అనుగుణంగా కనిపించేలా ప్రపంచ పటాన్ని ప్రదర్శించడమే ఐరాస ప్రతిపాదన ఉద్దేశం.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్ సహా భారత భూభాగం మొత్తాన్ని భారత అధికారిక పటం ప్రకారం చూపించాలని ఐరాసను భారత్ కోరింది. తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై తమ వైఖరి స్పష్టమైనదని, అచంచలమైనదని విదేశాంగ శాఖ పేర్కొన్నది. వాస్తవానికి దేశాలను వాటి సాపేక్ష భూభాగ వైశాల్యం ప్రకారం చూపించే పటాల వినియోగ ప్రతిపాదనకు భారత్ అనుకూలంగా ఓటేసింది. అయితే అలాంటి పటాల్లో భారత భూభాగాన్ని తప్పుగా చూపించే అవకాశం ఉందని భారత్ ఆందోళన చెందుతున్నది.