న్యూఢిల్లీ, అక్టోబర్ 30: తూర్పు లద్దాఖ్‌లోని దెమ్చోక్, దెప్సాంగ్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తయినట్టు భారత ఆర్మీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఇరు దేశాల మధ్య జరిగిన దౌత్య ఒప్పందంలో భాగంగా అక్టోబర్ 25న బలగాల ఉపసంహరణ ప్రారంభమైనట్టు చెప్పాయి. ఈ ప్రాంతాల్లో త్వరలోనే గస్తీ ప్రారంభం కానున్నట్టు వెల్లడించాయి. గురువారం దీపావళి సందర్భంగా ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకుంటారని తెలిపాయి. బలగాల ఉపసంహరణ తర్వాత పురోగతి, పెట్రోలింగ్ నిర్వహణ పద్ధతులపై స్థానికంగా కమాండర్ల స్థాయిలో జరిగే చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించాయి. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య జరిగిన భీకర ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో దెమ్చోక్, దెప్సాంగ్ ప్రాంతాల్లో ఇరు దేశాలు బలగాలను మోహరించాయి.