ఢిల్లీ, మే 7: పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న భారత్.. పీవోకే, పాక్‌లోని 9 ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకొని మిస్సైళ్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఈ లక్ష్యాలను భారత ఆర్మీ ఎంచుకోవడం వెనుక ముఖ్యమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
జైషే ప్రధాన కార్యాలయం నేలమట్టం..
భారత దళాలు లక్ష్యంగా చేసుకున్న వాటిలో జహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం ఒకటి. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పట్టణం జైషే కార్యకపాపాలకు ప్రధాన కేంద్రంగా పేర్కొంటారు. 2019లో పుల్వామా దాడి జరిగినప్పటి నుంచి ఇది భారత్‌కు లక్ష్యంగా మారింది. జైషే ప్రధాన కార్యాలయంగా చెప్పుకొనే ‘సుబాన్’లోనే పుల్వామా దాడికి వ్యూహరచన జరిగినట్టు సమాచారం. జైషే క్యాడర్‌కు ఇక్కడే శిక్షణ ఇస్తారని తెలుస్తున్నది. భారత్ ధ్వంసం చేసిన మరో స్థావరం మురిద్కే.. భారత్-పాక్ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది లష్కరే తాయిబా ఉగ్ర స్థావరం. 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఈ స్థావరంలోనే తలదాచుకున్నట్టు తెలుస్తున్నది.
పీవోకేలోని పలు ఉగ్ర స్థావరాలను కూడా భారత్ నేలమట్టం చేసింది. పీవోకేలోని తంగ్ధర్ సెక్టార్ పరిధిలో ఉన్న లష్కరే తాయిబా ఉగ్ర క్యాంపు సవాయిపై భారత్ దాడులు చేసింది. మన దేశంలో జరిగిన పలు దాడులకు ఈ ఉగ్ర స్థావరంతో సంబంధం ఉన్నది. 2024 అక్టోబర్ 20న జరిగిన సోన్మార్గ్, 2024 అక్టోబర్ 24 నాటి గుల్మార్గ్ ఎటాక్, తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రదాడితోనూ ఈ క్యాంప్‌కు లింకులున్నాయి. పూంచ్- రాజౌరీ పరిధి ఎల్వోసీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్ ఉగ్ర స్థావరాన్ని కూడా భారత దళాలు ధ్వంసం చేశాయి. పూంచ్‌లో పరిధిలో 2023 ఏప్రిల్‌లో సైనికులపై జరిగిన దాడితోపాటు, 2024 జూన్‌లో హిందూ యాత్రికులపై జరిగిన దాడితో ఈ ఉగ్ర స్థావరానికి లింకులు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.
ఇంటెలిజెన్స్ పటిష్ఠ నిఘా…
ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) విభాగాలు పూర్తిస్థాయిలో ఈ 9 ఉగ్ర స్థావరాలపై ప్రత్యేకంగా పటిష్ఠ నిఘా పెట్టి, వాటిని దాడులకు ఎంచుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో భారత మిలటరీ వ్యూహాలు రచించి, లష్కరేకు చెందిన 3, జైషేకు చెందిన 4, హిజ్బుల్‌కు చెందిన 2 ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్టు తెలుస్తున్నది.
స్థావరం పేరు: మర్కాజ్ అబ్బాస్
ప్రాంతం: కోట్లి, పీవోకే అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 35 కిలోమీటర్లు
ఎవరిది: జైషే మహమ్మద్ బాంబర్ క్యాంప్
స్థావరం పేరు: షవాయ్ నల్లాహ్
ప్రాంతం: ముజఫరాబాద్, పీవోకే అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 30 కిలోమీటర్లు
ఎవరిది: లష్కరే తోయిబా ట్రైనింగ్ క్యాంప్
స్థావరం పేరు: మర్కాజ్ అహ్లే హదిత్
ప్రాంతం: బర్నాల, పీవోకే అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 10 కిలోమీటర్లు
ఎవరిది: లష్కరే తాయిబా ఆయుధాల క్యాంప్
స్థావరం పేరు: సైద్నా బిలాల్
ప్రాంతం: ముజఫరాబాద్, పీవోకే అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 30 కిలోమీటర్లు
ఎవరిది: జైషే మహమ్మద్ రవాణా క్యాంప్
కోట్లి
స్థావరం పేరు: మస్కర్ రహీల్ షహీద్
ప్రాంతం: కోట్లి, పీవోకే
అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 35 కిలోమీటర్లు
ఎవరిది: హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం
సర్జల్
స్థావరం పేరు: తెహ్రా కలాన్
ప్రాంతం: సర్జల్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 8 కిలోమీటర్లు
ఎవరిది: జైషే మహమ్మద్ రవాణా క్యాంప్
బహవల్పూర్
స్థావరం పేరు: మర్కజ్ సుబాన్, ప్రాంతం: బహవల్పూర్, పాకిస్థాన్
అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 100 కిలోమీటర్లు , ఎవరిది: జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంl మెహ్మూనా జోయాస్థావరం పేరు: మెహ్మూనా జోయా
ప్రాంతం: సియాల్కోట్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 15 కిలోమీటర్లు
ఎవరిది: హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం
మురిద్కే
స్థావరం పేరు: మర్కాజ్ తాయిబా
ప్రాంతం: మురిద్కే, పాకిస్థాన్
అంతర్జాతీయ సరిహద్దుకు దూరం: 30 కిలోమీటర్లు
ఎవరిది: లష్కరే తాయిబా క్యాంపు కార్యాలయం