న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’లో అక్రమాలు, అవకతవకలకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ ర్యాలీలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. దీనికి సంబంధించి కూటమి బుధవారం ఒక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఆయన చెప్పారు. ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
యువతను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ అక్టోబర్ 2-8 మధ్య దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలు నిర్వహించాలని అన్ని పార్టీలు నిర్ణయించినట్టు ఖర్గే తెలిపారు. అక్టోబర్ 6న విపక్ష ఎంపీలందరూ ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు. ఓటు చోరీకి పాల్పడుతున్న ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్ష నాయకులు అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతి ముర్ము అపాయింట్మెంట్ను కోరుతారన్నారు. దేశవ్యాప్తంగా తాము ఐదు పెద్ద ర్యాలీలు నిర్వహిస్తామని, వాటి స్థలం, తేదీలను త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. కాగా, ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌లు ఆన్లైన్లో హాజరైనట్టు ఆయన చెప్పారు. అందరూ కలిసి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై పోరాటం చేయాలని నిర్ణయించినట్టు ఖర్గే తెలిపారు.
‘సర్’ ముగిసిన రాష్ర్టాల్లో ఓటర్ నమోదు కోసం ఫామ్-6తో పాటు అదనపు సర్ డిక్లరేషన్ సమర్పించాలన్న నిబంధనను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉపసంహరించుకొన్నది.