లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది స్థానాలకు త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులంతా ‘సైకిల్’ గుర్తుపై పోటీ చేస్తారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే కూటమి లక్ష్యమని చెప్పారు. అయితే సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదని అన్నారు. ‘కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. ఒక పెద్ద విజయం కోసం భుజం భుజం కలిపాయి. ఈ ఉప ఎన్నికల్లో ఘన విజయంతో ‘ఇండియా’ బ్లాక్ కొత్త చరిత్ర సృష్టిస్తుంది. అపూర్వమైన సహకారం, మద్దతుతో మొత్తం 9 అసెంబ్లీ సీట్లలో గెలవాలనే సంకల్పం, శక్తి ప్రతి ‘ఇండియా’ బ్లాక్ కార్యకర్తలో నిండి ఉంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ రాజ్యాంగం, శాంతి భద్రతలు, వెనుకబడినవారు, దళితులు, మైనారిటీల గౌరవం కోసం ఈ ఎన్నికల్లో పోరాడుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 13న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కతేహరి (అంబేద్కర్ నగర్), కర్హల్ (మెయిన్‌పురి), మీరాపూర్ (ముజఫర్‌నగర్), ఘజియాబాద్, మఝవాన్ (మీర్జాపూర్), సిషామౌ (కాన్పూర్ నగరం), ఖైర్ (అలీఘర్), ఫుల్పూర్ (ప్రయాగ్‌రాజ్) , కుందర్కి (మొరాదాబాద్) సీట్లు ఖాళీ అయ్యాయి. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎంపీలుగా ఎన్నికయ్యారు. క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకిపై అనర్హత వేటు పడింది. దీంతో సిషామౌ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఖాళీ అయిన మిల్కిపూర్ (అయోధ్య) స్థానాన్ని ఈసీ పక్కన పెట్టింది.