Modi-Putin | న్యూ ఢిల్లీపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు (US Tariff Impact) రష్యాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నాటో సెక్రటరీ జనరల్ (NATO Secretary-General) మార్క్ రుటె (Mark Rutte) పేర్కొన్న విషయం తెలిసిందే. ట్రంప్ విధించిన టారిఫ్‌లతో ఇబ్బంది పడుతున్న న్యూఢిల్లీ.. రష్యా అధినేతతో ప్రధాని మోదీ మాట్లాడినట్లు తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహంపై మోదీ ఆరా తీసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై భారత్ తాజాగా స్పందించింది. నాటో చీఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
ప్రధాని మోదీ, పుతిన్ మధ్య అలాంటి చర్చలు ఏమీ జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించి నాటో చీఫ్ మార్క్ రుటె చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. ఆయన చెప్పినట్టుగా మోదీ-పుతిన్ మధ్య అలాంటి చర్చలు ఏవీ జరగలేదు. ఆయన చేసిన ప్రకటన తప్పు. పూర్తిగా నిరాధారమైనవి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
న్యూయార్క్‌లో నాటో సెక్రటరీ జనరల్ (NATO Secretary-General) మార్క్ రుటె (Mark Rutte) మాట్లాడుతూ.. ‘రష్యా నుంచి చమురు కొంటోందన్న కారణంగా భారత్‌పై ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సుంకాలతో భారత్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. దీంతో రష్యా అధినేతకు ఢిల్లీ నుంచి ఫోన్ వెళ్తోంది. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహంపై మోదీ ఆరా తీస్తున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు’ అని మార్క్ రుటె వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
Also Read..
Sonam Wangchuk | లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్
MiG-21 Fighter jet | రిటైర్ అయిన మిగ్-21 ఫైటర్ జెట్స్.. 62 ఏళ్ల సేవలకు గుడ్‌బై చెప్పిన వాయుసేన