న్యూఢిల్లీ : ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడి కేసు దర్యాప్తులో గొప్ప ముందడుగు పడింది. సూసైడ్ బాంబర్ టెర్రర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన కశ్మీరీ వ్యక్తి అమీర్ రషీద్ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఈ ఉగ్రదాడికి ఉపయోగించిన హ్యుండయ్ ఐ20 కారు అమీర్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు గుర్తించిన తర్వాత అతనిని అరెస్ట్ చేశారు. ఉమర్ వద్దకు ఈ కారు చేరడంలో సహాయపడటం కోసం అమీర్ కశ్మీరు నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఈ కారులోనే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లొసివ్ డివైస్ (ఐఈడీ)ని అమర్చి, ఉమర్ ఎర్ర కోట వద్ద ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ కారులో కాలిపోయిన మృతదేహం ఉమర్‌దేనని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది. ఈ దాడి కోసం ఉమర్‌తో కలిసి అమీర్ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. టెర్రర్ డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.
వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌పై దర్యాప్తులో భాగంగా హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మను అరెస్ట్ చేశారు. ఆమె జమ్ముకశ్మీరులోని అనంత్‌నాగ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేస్తున్నారు. జమ్ముకశ్మీరు పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నెల 10న ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద జరిగిన పేలుడు కేసు దర్యాప్తుతో కూడా ఈ దర్యాప్తుకు సంబంధం ఉంది. అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గతంలో పని చేసిన అదీల్‌ను ప్రశ్నించిన తర్వాత డాక్టర్ శర్మ పేరు వెలుగులోకి వచ్చింది. టెర్రర్ మాడ్యూల్‌కు లాజిస్టికల్, ఆర్థిక సహకారం అందజేసిన వారి పేర్లు బయటకు వచ్చాయి.
‘మదర్ ఆఫ్ సాతాన్’ గా పిలిచే ట్రియాసిటోన్ ట్రైపెరాక్సైడ్(టీఏటీపీ)ను ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఉపయోగించిన పేలుడులో ఉపయోగించారని పోలీసులు భావిస్తున్నారు. ఈ టీఏటీపీ పొడి కేవలం వేడి వల్ల పేలిపోతుంది. ఈ టీఏటీపీని ఢిల్లీ పేలుడులో ఉపయోగించారా లేదా అనే విషయంలో ఫోరెన్సిక్ నిపుణులు ఇంకా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2017లో బార్సిలోనా దాడులు, అదే ఏడాది మాంచెస్టర్ బాంబు పేలుడు, 2016లో బస్సెల్స్ పేలుళ్లు, 2015 పారిస్ దాడిలో టీఏటీపీని ఉపయోగించారు.
సైనికులు మాత్రమే వాడే మూడు 9ఎంఎం బుల్లెట్లు ఘటనాస్థలంలో దొరకటం సంచలనంగా మారింది. ఈ మూడింట్లో ఒక బుల్లెట్ వాడేసినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తులో ఇది కొత్త కోణాన్ని సృష్టించిందని పోలీసులు భావిస్తున్నారు.