India-Srilanka meet : భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఇవాళ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధన, వాణిజ్య సంబంధాలను భవిష్యత్ దృష్టికోణంలో మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలని, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, మల్టీ-ప్రొడక్ట్ పెట్రోల్ పైప్లైన్లను ఏర్పాటుచేసి ఇంధన సంబంధాలను కూడా పెంచుకోవాలని సమావేశంలో చర్చించారు.
ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి పెట్టుబడి ఆధారిత వృద్ధి అవసరమని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ కనెక్టివిటీ అనేవి ఇరుదేశాల ఆర్థిక సంబంధాలకు మూల స్తంభాలుగా ఉండాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీ ప్రొడక్ట్ పెట్రోలియం పైప్లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, దీని ద్వారా శ్రీలంకకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు.
భారత్-శ్రీలంక దేశాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు రామేశ్వరం-తలైమానార్ మధ్య ఫెర్రీ సర్వీస్లను ప్రారంభించున్నట్లు మోదీ ప్రకటించారు. ఇరుదేశాల భద్రతా ప్రయోజనాలు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయని, అందుకే రక్షణ సహకార ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసుకోవాలని తాము నిర్ణయించామని, ఇప్పటికే హైడ్రోగ్రఫీ సహకారం కోసం ఒప్పందం కూడా కుదిరిందని ఆయన తెలిపారు.
ఇద్దరు దేశాధినేతల మధ్య మత్స్యకారుల సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. తమిళుల సమస్యలపైనా ఇరువురు నేతలు చర్చించారు. శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని భారత్ ఆశిస్తోందని మోదీ చెప్పారు.
భారత్ ఇప్పటివరకు శ్రీలంకకు 5 బిలియన్ డాలర్ల విలువైన గ్రాంట్లు, క్రెడిట్ లైన్స్ ఇచ్చిందని ప్రధాని వెల్లడించారు. దిసనాయకే మాట్లాడుతూ.. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే తన తొలి విదేశీ పర్యటనని, భారత్లో పర్యటించడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. పబ్లిక్ సర్వీస్లను డిజటలైజ్ చేయడంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని, శ్రీలంక కూడా ఇదే బాటలో నడుస్తోందని చెప్పారు. శ్రీలంకకు భారత్ మద్దతు ఉంటుందని మోదీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.