(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : భారత్-యురోపియన్ యూనియన్ (యూరప్‌లోని 27 సభ్య దేశాలు) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఎట్టకేలకు కుదిరింది. ఈయూ దేశాలకు ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై సుంకాలను జీరోకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ డీల్ రూపొందింది. తాజా డీల్‌తో 99.5 శాతం భారత ఎగుమతులపై సుంకాలు ఎత్తేసినట్టు సమాచారం. మొత్తంగా 9,425 వస్తువులు, సేవలపై జీరో టారిఫ్‌లను విధించినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఈ డీల్‌తో ఈయూ దేశాల నుంచి దిగుమతి అయ్యే ఖరీదైన కార్లు, ఆల్కహాల్, ఫార్మా ఉత్పత్తుల ధరలు కూడా దిగిరానున్నాయి.
ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడమే గాకుండా.. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, సామరస్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ప్రధాని మోదీ అన్నారు. రైతులు, చిన్న పరిశ్రమలు, ఈయూ దేశాలకు వెళ్లే ఉద్యోగార్థులకు ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని ఆకాంక్షించారు. ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగో వంతుకు సమాన విలువ కలిగిన ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ అభివర్ణించారు. తాజా ఒప్పందంతో భారత్, ఈయూ దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి 2007లోనే చర్చలు మొదలైనా ఆటోమొబైల్స్, ఆల్కహాల్, ఫార్మా ఉత్పత్తుల దిగుమతి సుంకాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ చర్చలు 2013లో నిలిచిపోయాయి. 2022లో మళ్లీ ప్రారంభమైన ఈ చర్చలు.. ట్రంప్ సుంకాల హెచ్చరికల నేపథ్యంలో వేగంగా ముందుకు కదిలాయి. చివరకు తాజాగా ఈ డీల్ కుదిరింది. అధికారికంగా ఈ ఒప్పందం కుదిరినప్పటికీ, ట్రేడ్ డీల్‌కు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకొనేందుకు ఆరు నెలల సమయం పట్టొచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఐరోపా రెగ్యులేటరీ నిబంధనలే దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.
