అలీగఢ్, ఏప్రిల్ 9: ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నేతలు చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అలీగఢ్ నుంచి పోటీచేస్తున్న ఓ అభ్యర్థి కూడా వినూత్నంగా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన పండిట్ కేశవ్ దేవ్‌కు ఎన్నికల సంఘం చెప్పుల జత గుర్తును కేటాయించింది. దీంతో తన గుర్తు ఓటర్లకు బాగా గుర్తుండాలనే తాపత్రయంతో వారిని ఆకట్టుకోవడానికి ఆయన తన మెడలో చెప్పుల దండను వేసుకొని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నెల 26న రెండో దశలో అలీగఢ్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. మొత్తానికి తన చెప్పుల దండ విజయ హారాన్ని మెడలో వేస్తుందో లేదో తెలుసుకోవాలంటే జూన్ 4న జరిగే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.