ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా విషాద సంఘటన జరిగింది. (Maharashtra’s Polls) ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చొని ఉన్న స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. బీడ్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. బీడ్‌కు చెందిన బాలాసాహెబ్ షిండే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. బుధవారం పోలింగ్ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఛత్రపతి షాహూ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రం వద్దకు వచ్చాడు. లైన్లో నిల్చొన్న అతడు ఉన్నట్టుండి నేలపై పడిపోయాడు.
కాగా, బాలాసాహెబ్ షిండేను తొలుత స్థానిక హాస్పిటల్‌కు, ఆ తర్వాత ఛత్రపతి శంభాజీ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల సమయంలో అభ్యర్థి మరణిస్తే ఆ నియోజకవర్గంలో ఓటింగ్‌ను వాయిదా వేయవచ్చు. అయితే ఈసీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.