IND vs PAK : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఇరు దేశాల ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. భారత్ సింధూ జలాల నిలిపివేత, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు లాంటి నిర్ణయాలు తీసుకుంది. అయినా పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బెదిరింపులకు దిగుతోంది.
అయితే పాకిస్థాన్ తుపాకి రాముడి బెదిరింపులను భారత్ లెక్కచేయడంలేదు. అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా పాక్‌ను దిగ్బంధనం చేస్తూ వస్తోంది. ఇది పాక్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన నేతలు నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ భారత్‌కు అణు బూచిని చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు.
ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని అన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు తమను తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయని చెప్పారు. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసిందని అన్నారు.
భారత్‌తో యుద్ధం విషయానికి వస్తే తాము అంకెల బలం మాయలో పడబోమని, ప్రజల మద్దతుతో తమ సంప్రదాయ అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తామని ఖలీద్ జమాలీ వ్యాఖ్యానించారు. కాగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఉగ్రవాదులంతా పాక్ జాతీయులని తేలింది.
అందులో ఒకడిని ఆ దేశ మాజీ పారా కమాండోగా గుర్తించారు. ఇక ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు.
ఈ నేపథ్యంలో సైనిక చర్య కూడా ఉంటుందన్న ఆందోళనతో యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్ ప్రకటనలు గుప్పిస్తోంది. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు వ్యాఖ్యానించారు.