భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు(Income Tax Raids) నిర్వహించారు. అయితే సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా గుర్తించారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాని నివాసాల్లో గత ఆదివారం నుంచి ఐటీశాఖ సోదాలు జరుగుతున్నాయి. సుమారు 155 కోట్ల పన్ను ఎగవేసినట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచి మూడు కోట్ల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. వాటి విలువ కోట్లల్లో ఉంటుందని భావిస్తున్నారు.
రాథోడ్, కేశర్వాని .. ఇద్దరూ బీడీ వ్యాపారం చేసేవారు. అయితే కేశర్వాని సుమారు 140 కోట్ల పన్ను ఎగవేసినట్లు తెలిసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను రెయిడ్ సమయంలో గుర్తించారు. అతను నిర్మాణ రంగ వ్యాపారంలో కూడా ఉన్నాడు. అయితే మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంటికి వెళ్లిన ఐటీశాఖ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన ఇంట్లో మూడు మొసళ్లను గుర్తించారు. ఇంట్లో ఉన్న ఓ చిన్నపాటి కుంటలో వాటిని గుర్తించారు. దీంతో వాళ్లు అటవీ శాఖను అలర్ట్ చేశారు.
కేశర్వాని ఇంట్లోనూ పలు బినామీ దిగుమతి కార్లను గుర్తించారు. ఒక్క కారు కూడా కేశర్వాని కుటుంబం పేరిట రిజిస్టర్ కాలేదు. ట్రాన్స్‌పోర్టు శాఖ నుంచి కార్లకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ కార్లను ఎలా కొన్నారన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. సాగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ తొలుత వ్యాపారం చేసేవాడు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా చీఫ్ పోస్టు కోసం కూడా ఆయన పోటీపడ్డారు. ఆయన తండ్రి హర్నమ్ సింగ్ రాథోడ్ ..గతంలో మధ్యప్రదేశ్ మంత్రిగా చేశారు.