న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ విధానాలు, నిర్ణయాలైన మద్యం పాలసీ, కుంభకోణాలు, నాయకత్వ లోపం వంటివి కారణాలని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శనివారం మీడియాతో అన్నా హజారే మాట్లాడారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పనితీరు సరిగా లేకపోవడానికి ‘సరిపోని’ నాయకత్వం, కుంభకోణాలు, రాజకీయ వివాదాలపై దృష్టి పెట్టడమే కారణమని అన్నారు.
కాగా, ఆప్ నేతలకు తాను పదే పదే సలహాలు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోలేదని అన్నా హజారే ఆరోపించారు. ‘ఎన్నికల అభ్యర్థులు స్వచ్ఛమైన వ్యక్తిత్వం, స్వచ్ఛమైన మనస్సు, కళంకం లేని ఖ్యాతి కలిగి ఉండాలని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నా. అయితే ఆప్ దానిని కోల్పోయింది. వారు మద్యం, డబ్బుతో కూడిన కుంభకోణాల్లో చిక్కుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీశారు. అందుకే ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి వారు ఇబ్బంది పడుతున్నారు’ అని విమర్శించారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నిరంతరం మంచి వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించారని అన్నా హజారే తెలిపారు. అయినప్పటికీ మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయాన్ని ప్రజలు చూశారని అన్నారు. ‘ఆరోపణలు రాజకీయాల్లో భాగమే. కానీ అమాయకత్వాన్ని వారు కాపాడుకోవాలి. సత్యం ఎప్పుడూ సత్యంగానే ఉంటుంది’ అని అన్నారు.
కాగా, ఆప్‌తో దూరంగా ఉండాలని తాను మొదటి నుంచి నిర్ణయించుకున్నట్లు అన్నా హజారే తెలిపారు. ‘ఒక సమావేశం జరిగినప్పుడు, ఆ పార్టీలో చేరకూడదని నేను నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి దూరంగా ఉన్నా. ప్రతిఫలాన్ని ఆశించకుండా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించడం సరైన విధానం. దీనిని గ్రహించడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఆయన మునిగిపోయారు’ అని ఎద్దేవా చేశారు.
Watch: On #DelhiElectionResults, Anna Hazare says, “I have been saying this for a long time—when contesting elections, a candidate must have a pure character and integrity. Sacrifice in life is essential, as these qualities earn the trust of voters. I have repeatedly emphasized… pic.twitter.com/OSSEDY5Ubm
— IANS (@ians_india) February 8, 2025