HMPV : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో, గుజరాత్ (Gujarath) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో హెచ్ఎంపీవీ (Human Meta Pneumo Virus) కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖలకు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలు జారీచేశారు.
శ్వాసకోశ సంబంధ అనారోగ్యానికి దారితీసే ఈ వైరస్ విస్తృతమైతే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యమంత్రి భరద్వాజ్ సూచించారు. ఈ వైరస్ కట్టడికి సంబంధించిన చర్యలపై అప్డేట్స్ కోసం ఢిల్లీ ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రతింపులు జరుపుతుండాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం తాత్సారం చేయవద్దని హెచ్చరించారు.
వైరస్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. వైరస్‌ను అడ్డుకునే ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు, సూచనలు కావాలన్నా తనను ఫోన్లో సంప్రదించాలని ఆదేశించారు. ప్రతిరోజు మూడు ఆస్పత్రులను తనిఖీ చేయాలని, సంబంధిత రిపోర్టులను ఎప్పటికప్పుడు తనకు పంపించాలని ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీచేశారు.