BSF high alert : బంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ (High alert) ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
కాగా, బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి మొదలైన గొడవ ‘చినుకు చినుకు గాలివానలా మారినట్లు’ పెరిగిపోయింది. తీవ్ర హింసకు దారితీసింది. వందల మంది మరణానికి కారణమైంది. ఆందోళనకారులకు, భద్రతాబలగాలకు నడుమ జరిగిన హింసలో కేవలం ఆది, సోమవారాల్లోనే 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. సోమవారం బంగ్లా ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ తర్వాత తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో భారత్కు బయలుదేరారు. పశ్చిమబెంగాల్లో ఆమె ఆశ్రయం తీసుకోనున్నట్లు సమాచారం. హసీనా రాజీనామా విషయాన్ని బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు ప్రకటించారు. దేశంలో తాత్కాలికంగా సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు శాంతించాలని, సైనిక సర్కారుకు సహకరించాలని కోరారు.