న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి బడ్జెట్లో నిరుద్యోగులకు శూన్య హస్తం చూపించారు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇందు కోసం నయా పైసా కేటాయించలేదు. కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల వరకు ఖాళీలు ఉండగా, వాటిని భర్తీ గురించి ప్రస్తావించలేదు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నైపుణ్యాభివృద్ధి పథకాలు చేపడతామని తెలిపారు. ఈ పథకం కింద వచ్చే మూడేండ్లలో 47 లక్షల మంది యువతకు ైస్టెపెండ్ ఇస్తామని పేర్కొన్నారు.
ఏడాదిన్నర కాలంలో 9 రాష్ర్టాలకు అసెంబ్లీ , ఆపై లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యువతకు నగదుతో గాలం వేయటమే ఈ పథకం ఉద్దేశమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండగా, ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 38 వేల టీచర్లు, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పోస్టులను వచ్చే మూడేండ్ల కాలంలో భర్తీ చేస్తామనటం గమనార్హం.