జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆల్వార్ మూకదాడి’ కేసులో రాజస్థాన్ కోర్టు నలుగురు నిందితులకు ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించింది. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆల్వార్ జిల్లాలో 2018లో కొంతమంది మూకదాడికి పాల్పడగా, ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రక్బార్‌ఖాన్ చనిపోయాడు. ఈ కేసులో పరంజీత్‌సింగ్, ధర్మేంద్ర యాదవ్, నరేశ్ శర్మ, విజయ్ కుమార్‌లను దోషులుగా తేల్చుతూ ఆల్వార్ జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఐదో నిందితుడు నావల్కిషోర్ను నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది.
రక్బార్‌ఖాన్, అస్లాంలపై 2018, జూలై 20న రామ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది మూకదాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలైన రక్బార్‌ఖాన్ హాస్పిటల్లో చనిపోయాడు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఉత్తరాదిన వివిధ రాష్ర్టాల్లో గోసంరక్షణ దళాలపేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగటం మొదలైంది. ఆవుల్ని వధశాలకు తరలిస్తున్నారన్న నెపంతో అమాయక ముస్లింలను కొట్టడం, చంపటం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది.
ఈ ఘటనలకు సంబంధించి నిందితులు బెయిల్‌పై విడుదలై స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగటం లేదు. రాజస్థాన్ కోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించటం, మూకదాడి ఘటనల్లో బహుశా ఇదే మొదటిసారి అని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.