న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. బాబా రాందేవ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీం పేర్కొన్నది. జస్టిస్ హిమా కోమ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది.
ఈ కేసులో పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సమన్లు కూడా జారీ చేసింది. తమ ఉత్పత్తులకు సంబంధించి చేస్తున్న ప్రకటనలను నిలిపివేయాలని గతంలో సుప్రీంకోర్టు పతంజలి ఆయుర్వేదకు ఆదేశాలు జారీ చేసింది. కానీ పతంజలి ఆయుర్వేద ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పతంజలితో పాటు బాలకృష్ణకు నోటీసులు ఇచ్చింది.
కోర్టు ధిక్కరణ నోటీసులు ఎందుకు ఇవ్వకూడదని సుప్రీం ప్రశ్నించింది. కానీ ఇప్పటి వరకు పతంజలి సంస్థ ఆ నోటీసులకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఎందుకు ప్రతిస్పందించలేదని, వచ్చే విచారణ సమయంలో ఎండీ హాజరుకావాలని కోర్టు పేర్కొన్నది. డ్రగ్స్ అండ్ రెమిడీస్ చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం రాందేవ్, బాలకృష్ణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కోర్టు తెలిపింది.