ముంబై: ఎలాగైనా పోలీస్ శాఖలో ఉద్యోగం దక్కించుకోవాలని ఒక వ్యక్తి భావించాడు. ఎంపిక పరీక్షలో మోసానికి పాల్పడ్డాడు. మైక్రో హియరింగ్ పరికరం (Micro Earpiece) వినియోగించి దొరికిపోయాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో మాదిరిగా ప్రయత్నించిన ఆ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. జల్నా జిల్లాలోని భోకర్డాన్‌కు చెందిన 22 ఏళ్ల కుష్నా దల్వి, శనివారం ముంబై ఓషివారాలోని రాయ్‌గఢ్ మిలిటరీలో నిర్వహించిన డైవర్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు. ఎగ్జామ్ రాస్తున్న అతడి చర్యలపై ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కుష్నాను పరిశీలించగా ఎడమ చెవిలో ఒక వినికిడి పరికరం ఉంది. దాని ద్వారా ఇద్దరు స్నేహితులను ప్రశ్నలకు సమాధానాలు అడిగి రాస్తున్నట్లు పసిగట్టారు.
కాగా, మైక్రో హియరింగ్ పరికరం పూర్తిగా చెవి లోపల ఉండటంతో పోలీసులు తొలుత దానిని గుర్తించలేకపోయారు. బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు అది కనెక్ట్ అయ్యిందని తెలుసుకున్నారు. కుష్నా స్నేహితులు సచిన్ బావస్కర్, ప్రదీప్ రాజ్‌పుత్ దాని ద్వారా ఫోన్లో అతడితో మాట్లాడుతూ ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నట్లు కనుగొన్నారు.
మరోవైపు కుష్నా నుంచి ఆ వినికిడి పరికరం, సిమ్‌కార్డు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేశారు. కుష్నాతోపాటు అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.