ఇంఫాల్: మణిపూర్‌లో జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. (Manipur Violence) తాజాగా గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు ప్రభుత్వ ఆసుపత్రికి నిప్పుపెట్టారు. పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోనే ఈ చర్యకు పాల్పడ్డారు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బోరోబెక్రా ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టినట్లు అధికారులు తెలిపారు. సంఘటన సమయంలో పీహెచ్సీలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏమీ జరుగలేదని చెప్పారు. భద్రతా దళాలు వెంటనే అక్కడకు చేరుకున్నట్లు వెల్లడించారు.
కాగా, మణిపూర్‌లోని మెజారిటీ వర్గమైన మైతీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని మైనారిటీ వర్గమైన కుకీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నుంచి మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 7న జిరిబామ్‌లో జరిగిన తాజా హింసలో ఐదుగురు మరణించారు.
బోరోబెక్రా సబ్ డివిజన్లోని నింగ్థెమ్ ఖునౌ, మోంగ్‌బంగ్ గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. మైతీ గ్రామమైన మోంగ్బంగ్లో కుకీ ఉగ్రవాదులు తుపాకీ కాల్పులు, బాంబు దాడులకు పాల్పడినట్లు మైతీ నేత ఆరోపించారు. దాడులను నిరోధించడానికి భద్రతా దళాలు మరింత కృషి చేయాలని కోరారు.