ముంబై,ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల శివాజీ విగ్రహం కూలడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ కేవలం ఒక పేరు లేదా ఒక చక్రవర్తి కాదు. మనకు ఆయన ఒక దైవం. ఇవాళ నేను నా శిరస్సును నా దైవం పాదాల ముందు వంచి క్షమాపణ అడుగుతున్నా’ అని మోదీ అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రూ.76 వేల కోట్లతో చేపట్టిన వంధన్ నౌకాశ్రయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సిక్కుల ఊచకోతలో టైట్లర్ పాత్రపై ఆధారాలున్నాయ్
అభియోగాల నమోదుకు ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం గట్టి షాక్ ఇచ్చింది. 1984లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసులో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్ పాత్రపై తగిన రుజువులు ఉన్నాయని, హత్య, అల్లర్లు జరగాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం వంటి నేరారోపణలను నమోదు చేయాలని ఆదేశించింది. ఢిల్లీలోని పూల్ బంగష్ గురుద్వారా వెలుపల ఠాకూర్ సింగ్, బదల్ సింగ్, గురుచరణ్ సింగ్ హత్యలకు సంబంధించిన కేసులో ఈ ఆదేశాలు ఇచ్చింది.
‘12 సార్లు హాజరయ్యా.. ఏడింటిని పట్టించుకోవద్దు’
న్యూఢిల్లీ, ఆగస్టు 30: సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షకు తాను 12 సార్లు హాజరైనప్పటికీ అందులో ఏడింటిని విస్మరించి ఐదింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జనరల్ క్యాటగిరీ కింద ఏడుసార్లు రాసిన పరీక్షను విస్మరించి, దివ్యాంగ కోటాలో నాలుగుసార్లు రాసిన పరీక్షలను మాత్రమే పరిగణించాలని వాదించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగ కోటాకు 40 శాతం వైకల్యం ఉండాలని, కానీ తనకు 47 శాతం వైకల్యం ఉన్నట్టు ఆమె కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.