తిరువనంతపురం: క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగించడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆ మంత్రగత్తెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, నరమాంసం వండుకుని తిన్న సంఘటన కేరళలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా మరువక ముందే క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. పతనంతిట్ట జిల్లాలోని మలయాళపుజా పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్ర పూజలు చేస్తున్నది. చిన్న పిల్లలను తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక కార్యాలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో క్షుద్ర పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయింది.
కాగా, ఈ విషయం తెలిసిన స్థానికులు మంత్రగత్తె శోభనకు వ్యతిరేకంగా గురువారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆమెపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. క్షుద్ర పూజలు చేస్తున్న ఆ మహిళను అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు విరమించబోమని భీష్మించారు. దీంతో డీఎస్పీ ఆదేశాలతో మంత్రగత్తె శోభనను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగించడంపై ఆమెను ప్రశ్నిస్తున్నారు.