తిరువనంతపురం: కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ ప్రతిపాదించిన ఎజెండాలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్(Free Travel Scheme) కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో కేరళలోని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కేఎస్ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ట్రావెల్ స్కీమ్‌ను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్కారును ఏర్పాటు చేయబోయే యూడీఎఫ్ దీనిపై పునరాలోచన చేయాలని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రైవేటు బస్సు రంగం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని ఆల్ కేరళ బస్ ఆపరేటర్స్ సంఘం జనరల్ సెక్రటరీ గోపినాథన్ తెలిపారు. అయితే ఎన్నికల్లో గెలిచిన యూడీఎఫ్.. బస్సుల్లో జెండర్ టికెటింగ్ జారీ చేస్తున్నది.
మహిళలకు, పురుషులకు వేర్వేరుగా టికెట్లు ఇస్తున్నది. మహిళా ప్రయాణికుల సంఖ్యను అంచనా వేసేందుకు ప్రభుత్వం ఆ చర్య తీసుకున్నది. బస్సు రవాణా రంగంలో ఉన్న ఇతర స్టేక్హోల్డర్ల అభిప్రాయాలు తీసుకోకుండానే ఉచిత స్కీమ్ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కేఎస్ఆర్టీసీ బస్సులకే పరిమితం అయితే, అప్పుడు ప్రైవేటు బస్సులు కేవలం విద్యార్థులకే అంకితం అవుతాయని గోపినాథన్ అన్నారు. ప్రైవేట్ బస్సు రంగంలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారని, ఒకవేళ స్కీమ్ కొనసాగితే వారి పరిస్థితి దయనీయంగా ఉంటుందన్నారు. ఆ స్కీమ్‌ను అమలు చేయడానికి ముందు ప్రైవేటు ఆపరేటర్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆశించారు.
అయితే ప్రస్తుతం యూడీఎఫ్ ఇంకా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. సీఎం ఎవరన్న దానిపై ఆ పార్టీలో కుమ్ములాటలు జరుగున్నాయి.