గిర్: గుజరాత్‌లోని గిర్ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో 8 సింహం కూనలు(Lion Cubs) మృతిచెందాయి. బేబీసియా ఇన్ఫెక్షన్ వల్ల ఆ కూనలు మృతిచెందినట్లు అటవీశాఖ మంత్రి అర్జున్ మోద్వాదియా తెలిపారు. అయితే ఆ ఇన్ఫెక్షన్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు అధికారులు సింహాలను 10 కిలోమీటర్ల పరిధిలో వేరు చేశారు. ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతానికి దూరంగా సింహాలను ఉంచారు. బేబీసియా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నామని, 8 పసికూనలు ఆ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి వెల్లడించారు.
బేబీసియా వ్యాధి ఓ పరాన్నజీవి వల్ల సోకుతుంది. పేనుల వల్ల ఆ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాధి సోకడం వల్ల జంతువు బలహీనమవుతుంది. జంతువుల్లో దగ్గు, ముక్కు నుంచి నీరు కారుతుంది. గిర్ సంరక్షణా కేంద్రం అవతల ఉన్న రెవన్యూ ప్రాంతాల్లో బేబిసియా ఇన్ఫెక్షన్ వ్యాప్తి అవుతోంది. గిర్ సోమనాథ్‌లోని గిర్ గధదా, అమ్రేలీ జిల్లాలోని బాబ్రా కోట్ ప్రాంతాల్లో బేబిసియా కేసులు నమోదు అయ్యాయి.
పశువైద్యులు శ్యాంపిళ్లను సేకరించారు. ఆ శ్యాంపిళ్లను గుజరాత్ బయోటెక్నాలజీ రీసర్చ్ సెంటర్‌కు టెస్టింగ్ కోసం పంపారు. మరో రెండు మూడు రోజుల్లో రిపోర్టులు రానున్నాయి. ఆ రిపోర్టుల ఆధారంగా బేబిసియా ఇన్ఫెక్షన్ను కన్ఫర్మ్ చేయనున్నారు. అయితే గత రెండు రోజులుగా మాత్రం కొత్త మరణాలు లేవని అధికారులు చెప్పారు. సింహం కూనల చనిపోయిన ప్రదేశానికి వెటర్నరీ డాక్టర్లు వెళ్లి మిగితా సింహాలను వేరు చేసినట్లు మంత్రి తెలిపారు.