అహ్మదాబాద్: నలుగురు పిల్లలతో సహా 12 మంది తీవ్ర జ్వరం (Heavy Fever) వల్ల మరణించారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతున్నదని రోగులు వాపోయారు. అయితే రోగం ఏమిటన్నది డాక్టర్లు సైతం గుర్తించలేకపోతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపించారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొన్నది. లఖ్పత్ తాలూకాలోని బెఖాడా, సనాండ్రో, మోర్గార్, భరవంద్ గ్రామాల్లో జనం వింత రోగాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో రోగులు బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సెప్టెంబర్ 3 నుంచి ఇప్పటి వరకు నలుగురు పిల్లలతో సహా 12 మంది తీవ్ర జ్వరంతో మరణించినట్లు చెప్పారు. భారీ వర్షాలకు ప్రభావితమైన ఈ ప్రాంతంలో రోగులకు వ్యాపిస్తున్న వ్యాధి ఏమిటన్నది డాక్టర్లు కూడా కచ్చితంగా నిర్ధారించలేకపోయినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
కాగా, ఈ మరణాలకు ప్రధాన కారణం న్యుమోనైటిస్ అని అధికారులు ఆదివారం తెలిపారు.హెచ్1ఎన్1, స్వైన్ ఫ్లూ, క్రిమియన్-కాంగో ఫీవర్, మలేరియా, డెంగ్యూ అవకాశాలను తోసిపుచ్చలేమని చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ తాలూకాలో వైద్య సేవలను ముమ్మరం చేసినట్లు కచ్ కలెక్టర్ అమిత్ అరోరా తెలిపారు. వైద్య బృందాలను అక్కడకు పంపడంతోపాటు రోగుల నుంచి నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.