ఘజియాబాద్: ఘజియాబాద్‌లో కత్తులు పంచుతున్న 10 మందిని అరెస్టు చేశారు. ప్రజలకు కత్తులు అందజేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఆ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. హిందూ రక్షా దళ్‌కు చెందిన కార్యకర్తలు ఘజియాబాద్‌లో కత్తులు పంపిణీ చేస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. డిసెంబర్ 29వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే ఈఘటనకు సంబంధించి 46 మందిపై కేసు బుక్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 191(2), 191(3), 127(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్లో ఉన్న ఆఫీసులో కత్తులను డిస్ట్రిబ్యూట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసు నుంచి 8 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హిందూ రక్షా దళ్ జాతీయ అధ్యక్షుడు పింకీ చౌదరీ కత్తులను పంచుతున్నట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. వైరల్ అయిన వీడియోలో చాలా మంది కత్తులను ప్రదర్శించారు.