పాట్నా: పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో సుమారు 500 మంది పోటీ పడ్డారు.
కాగా, పురుషుల విభాగంలో బార్హ్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ విజేతగా నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 420 గ్రాముల పెరుగు తిన్నాడు. మహిళల విభాగంలో పాట్నాకు చెందిన ప్రేమ తివారీ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె 3 నిమిషాల్లో 2 కిలోల 718 గ్రాముల పెరుగు తిన్నది.
ఇక సీనియర్ సిటిజన్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ శంకర్ కాంత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 647 గ్రాముల పెరుగు తిని మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ఈ ముగ్గురూ ‘దహీ శ్రీ’ టైటిల్ను సొంతం చేసుకున్నారు. 2020లో కూడా శంకర్ కాంత్ 4 కిలోల పెరుగు తిని ఈ టైటిల్ను గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Looks like the competition was 'curdled' with tension, but the dairy warrior emerged victorious by gobbling up 3 kgs & 647 gms of curd in just 3 minutes! Sudha Dairy successfully organized a Curd-Eating Competition today at Patna Dairy Project to promote health benefits of curd. pic.twitter.com/4aE2HeAMRD
— National Cooperative Dairy Federation of India Ltd (@ncdficoop) January 18, 2023