భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 28 ఏండ్ల మహిళపై షాదోల్ జిల్లా క్షీర్సాగర్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన శనివారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు షాదబ్ ఉస్మానికి బాధితురాలితో ఏడాదిగా వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. శనివారం నిందితుడి కారులో వారు క్షీర్సాగర్కు పిక్నిక్ వెళ్లారు.
నిందితుడు తన స్నేహితులు రాజేష్ సింగ్, సోనూ జార్జ్లను ఘటనా స్ధలానికి పిలవగా ముగ్గురూ మద్యం సేవించి బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై మహిళకు బలవంతంగా విషం తాగించడంతో ఆమె మరణించింది. ప్రధాన నిందితుడు పరారు కాగా మిగిలిన ఇద్దరు నిందితులు ఆమె మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి వెలుపల విడిచివెళ్లారు.
ఆపై మహిళ అతిగా మద్యం సేవించడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి కుటుంబసభ్యులకు వారు సమాచారం అందించారు. పోస్ట్మార్టం నివేదికలో మహిళ విషం సేవించిందని, ఆమెపై లైంగిక దాడి జరిగిందని వెల్లడైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.