న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-321 ఢిల్లీ- అమృత్సర్ విమానం.. పాకిస్థాన్ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించింది. దీంతో కొంత ఉద్రిక్త క్షణాలు నెలకొన్నాయి. అయితే పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కొన్ని సెకన్ల పాటు పాక్ గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. పాక్ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించిన విషయాన్ని పైలట్ గుర్తించాడని, పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ అథారిటీ నుంచి పైలట్‌కు వార్నింగ్ మెసేజ్‌లు వచ్చినట్లు తెలిసింది.
సోమవారం రాత్రి 9.18 నిమిషాలకు ఢిల్లీ నుంచి ఆ విమానం టేకాఫ్ తీసుకున్నది. అయితే అమృత్‌సర్‌లో 10.30 నిమిషాలకు ఆ విమానం ల్యాండ్ కావాలి. కానీ అనుకోకుండా ఆ విమానం పాక్ ఎయిర్‌స్పేస్‌లోకి ఎంటరైంది. ఆ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మేనేజింగ్ అధికారి తెలిపారు. స్థానిక ఎయిర్ పోర్టు కంట్రోల్ రూమ్ ఆదేశాలతో ఆ విమానం ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. మళ్లీ రెండు గంటల వ్యవధి తర్వాత టేకాఫ్ తీసుకుని ఆ రోజు రాత్రి 2.20 నిమిషాలకు అమృత్సర్ చేరుకున్నది.
పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌లో కనీసం రెండు కిలోమీటర్ల దూరం కూడా ఆ విమానం వెళ్లలేదని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ భూపేందర్ సింగ్ తెలిపారు.