చెన్నై: తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా పది చట్టాలను గెజిట్‌లో నోటిఫై చేసింది. (Tamil Nadu notifies 10 Acts) ఒక రాష్ట్రం ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 11న ఆ రాష్ట్ర గెజిట్‌లో పది చట్టాలను అధికారికంగా నోటిఫై చేసింది. ఈ చట్టాలను గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలుపకపోవడంతో ప్రత్యేక సమావేశంలో వాటిని తిరిగి ఆమోదించారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపారు.
కాగా, భారత రాజ్యాంగం ప్రకారం సాధారణంగా ఒక బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపుతారు. గవర్నర్ ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అలాగే గవర్నర్ తన సమ్మతిని నిలిపివేయవచ్చు. పునఃపరిశీలన కోసం బిల్లును ప్రభుత్వానికి తిరిగి పంపవచ్చు. లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. అయితే తిరిగి వచ్చిన బిల్లును మార్పులతో లేదా మార్పులు లేకుండా మళ్లీ శాసనసభ ఆమోదించినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి. దానిని మళ్లీ రిజర్వ్ చేయలేరు. హైకోర్టు లేదా కేంద్రం పరిధిలోని అంశాలను ప్రభావితం చేసే బిల్లు మాత్రం తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాలి.
మరోవైపు తమిళనాడు ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించలేదు. అలాగే అసెంబ్లీ తిరిగి ఆమోదించిన ఈ బిల్లులను తప్పుగా రాష్ట్రపతికి పంపడం న్యాయపరమైన సవాలుకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపిన గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్‌కు సమర్పించిన 2023 నవంబర్ 18 నాడు ఆ బిల్లులు ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలు (రెండవ సవరణ) 2022, తమిళనాడు ఫిషరీస్ యూనివర్శిటీ (సవరణ) చట్టం 2020 (గతంలో తమిళనాడు డాక్టర్ జే జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీగా ఉన్న పేరు మార్పు), ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు వంటి చట్టాలను గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేశారు. ఈ సందర్భంగా డీఎంకే అంటే చరిత్రను సృష్టించడం అని సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.