Nuclear Warheads : ఇండియా దగ్గరఅణ్వాయుధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీటిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, ఇటీవలే మన అణు సామర్ధ్యానికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సిప్రి (స్టాక్‌హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ వివిధ దేశాల్లో ఉన్న అయుధాలు, అణ్వాయుధాల గురించి వివరాలు వెలికితీస్తుంది. ఈ సంస్థ నివేదిక ద్వారా భారతీయ అణుసామర్ధ్యం గురించి ప్రపంచానికి కీలక విషయాలు తెలిశాయి.
సాధారణంగా ఏ దేశమైనా తమ అణు సామర్ధ్యం గురించి బయటకు చెప్పదు. ఇండియా కూడా కొన్నేళ్లుగా అదే చేస్తూ వస్తోంది. కానీ, ఈసారి మాత్రం ఇండియా కొన్ని విషయాల్ని బయటపెట్టింది. దశాబ్దాలుగా ఉన్న తన విధానాన్ని మార్చుకుంది. ఇండియా తయారు చేసిన 12 అణ్వాయుధాలను బహిరంగపర్చినట్లు సిప్రి నివేదిక తేల్చింది. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా అణు వార్ హెడ్లను రహస్యంగా దాచకుండా, ప్రయోగానికి సిద్ధం చేసి ఉంచింది. అంటే అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధం చేసిందని అర్థం. ఈ అణ్వాయుధాలను అండర్‌గ్రౌండ్ సిలోస్ లోపల, సబ్‌మెరైన్స్ లోపల ప్రయోగానికి సిద్ధం చేసి ఉంచారు.
అలా, 12 అణ్వాయుధాలను ప్రత్యేక బేస్‌లలో, సైనిక దళాల ఆధ్వర్యంలో ఇండియా సిద్ధం చేసి ఉంచింది. ఈ ఏడాది జనవరి నాటికి ఇండియా వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి అంచనా. వీటిని విమానాల నుంచి, నేలమీద నుంచి, సముద్రాల నుంచి ప్రయోగించడానికి అవకాశం ఉంది. ఆయుధాలు ప్రయోగించే ప్రదేశాలకు అణ్వాయుధాలను దూరంగానే ఉంచుతారు. అయితే, ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాల్ని ముందుగా మోహరించి సిద్ధం చేస్తున్నారు. ఇలా అణ్వాయుధాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచినప్పటికీ తన మూల సూత్రాలను మర్చిపోలేదని సిప్రి నివేదిక తేల్చింది.
‘నో ఫస్ట్ యూజ్’ అనే పాలసీని ఇండియా అనుసరిస్తోంది. అంటే, అణ్వాయుధాలను ముందుగా మనం ప్రయోగించకూడదు అనేది మన దేశ అణువిధానం. మన దేశం మీద అణు దాడి జరిగినప్పుడే ఇండియా శతృదేశాలపై అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది.