చెన్నై: మద్రాసు హైకోర్టు(Madras High Court) ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన 397 కోట్ల కుంభకోణం గురించి దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. విద్యుత్తు శాఖ మంత్రిగా వీ సెంథిల్‌బాలాజీ ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. అయితే దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, సీబీఐకి అన్ని రికార్డులు, డాక్యుమెంట్లను అందజేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ కేసు విచారణకు సిట్ వేయాలని అరప్పోర్ ఇయ్యక్కమ్ ఓ పిటీషన్ వేశారు. ఇక ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని అన్నాడీఎంకే అడ్వకేట్లు డిమాండ్ చేశారు.
2021 నుంచి 2023 వరకు విద్యుత్తుశాఖ మంత్రిగా సెంథిల్‌బాలాజీ ఉన్నారు. ఆ సమయంలో 45 వేల ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. కానీ సుమారు 397 కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్కామ్ గురించి దర్యాప్తు చేపట్టాలని మద్రాసుహైకోర్టు సీబీఐని కోరింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర సర్కారు అన్ని రకాలుగా సీబీఐకి సహకరించాలని తన ఆదేశాల్లో కోర్టు స్పష్టం చేసింది. ఇన్వెస్టిగేషన్ ఇంచార్జీ ఆఫీసర్‌కు అన్ని ఫైళ్లను ట్రాన్స్ఫర్ చేయాలని డీవీఏసీని కోర్టు ఆదేశించింది.