పాట్నా: టోల్ ప్లాజాల వద్ద వారం రోజుల్లో సుమారు పది కోట్ల ఈ-చలాన్లు (E-Challans) జారీ చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు భారీగా జరిమానాలు విధించారు. ఈ-చలాన్ల జారీ కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఈ-డిటెక్షన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. బీహార్ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలోని 13 టోల్ ప్లాజాలలో ఈ-డిటెక్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. తద్వారా ఆగస్టు 7 నుంచి 15 వరకు వారం రోజుల్లో రూ.9.49 కోట్ల విలువైన 16,755 ఈ-చలాన్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 9,676 ఈ-చలాన్లు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలకు చెందినవి కాగా, బీహార్‌లో రిజిస్టర్ అయిన వాహనాలకు 7,079 ఈ-చలాన్లు జారీ చేసినట్లు చెప్పారు.
కాగా, బీహార్ ట్రాఫిక్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) సుధాంశు కుమార్ దీని గురించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో, ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ-చలాన్ జారీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తొలుత 13 టోల్ ప్లాజాల వద్ద ఈ-డిటెక్షన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెల్లుబాటు అయ్యే బీమా, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్లు లేని వాహనాలకు ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ-చలాన్లు వారి మొబైల్ ఫోన్స్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఎన్ఐసీ సహాయంతో బీహార్ రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ-డిటెక్షన్ సిస్టమ్‌ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని సుధాంశు కుమార్ తెలిపారు. ఈ వ్యవస్థ స్వయంగా వాహనాలను తనిఖీ చేస్తుందని, అవసరమైన పత్రాలు లేనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ చేస్తుందని చెప్పారు. తద్వారా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించకుండా, అలాగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.