లక్నో: జనన ధృవీకరణ పత్రాలు (Birth Certificates) జారీ చేసేందుకు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) కోసం గ్రామ కార్యదర్శికి కేటాయించిన యూజర్ ఐడీ లీక్ అయ్యింది. కొందరు వ్యక్తులు ఈ ఐడీని దుర్వినియోగం చేశారు. అదే గ్రామంలో పుట్టినట్లు ఆరు రాష్ట్రాల్లో 800కుపైగా జనన ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తు కోసం జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సించావలి సాని గ్రామంలో సుమారు వెయ్యి మందికిపైగా జనాభా ఉన్నారు.
కాగా, సించవలి సాని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్చంద్ ఆగస్టు 5న సీఆర్ఎస్ పోర్టల్ లాగిన్ ఐడీ వివరాలు పొందారు. ఆ గ్రామ జనాభా 1,100 మంది ఉండగా ఇప్పటి వరకు 814 జనన ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయని గమనించారు. గత 19 నెలలుగా ఆ గ్రామానికి కేటాయించిన యూజర్ ఐడీ ద్వారా ఉత్తరప్రదేశ్లో 780, జార్ఖండ్లో 13, బీహార్లో 12, మధ్యప్రదేశ్, హర్యానాలో నాలుగు చొప్పున, కర్ణాటకలో ఒకటి చొప్పున బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించారు.
మరోవైపు అన్ని జనన ధృవీకరణ పత్రాల్లో సించావలి సాని గ్రామాన్ని పుట్టిన ప్రాంతంగా పేర్కొనడం చూసి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్చంద్ షాక్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఆర్ఎస్ యూజర్ ఐడీ లీక్ కావడం, దానిని దుర్వినియోగం చేసి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయడంపై దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరిన్ని రాష్ట్రాల వారికి కూడా ఇదే గ్రామంలో పుట్టినట్లు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.