కోల్‌కతా: ఆర్మీ అధికారిగా నమ్మించిన 24 ఏళ్ల వ్యక్తి పలు మోసాలకు పాల్పడ్డాడు. (Imposter Arrested) ఏకంగా ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ హెడ్క్వార్టర్స్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేయడంతో అతడి గుట్టురట్టయ్యింది. ఆర్మీ మేజర్‌గా నటించిన వ్యక్తి లగ్జరీ హోటల్లో బస చేశాడు. బీఎండబ్ల్యూ కారులో తిరిగిన అతడు శనివారం కోల్‌కతాలోని ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ అయిన ఫోర్ట్ విలియమ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అక్కడి సెక్యూరిటీకి మొబైల్ ఫోన్లో ఒక ఐడీ కార్డు చూపించాడు. 5వ గూర్ఖా రైఫిల్స్ (ఫ్రాంటియర్ ఫోర్స్) విభాగానికి చెందిన మేజర్ ఎంఎస్ చౌహాన్‌గా అందులో ఉంది.
కాగా, ఆ వ్యక్తి ఎంట్రీ రిజిస్టర్లో వివరాలు రాయలేకపోయాడు. పదే పదే మొబైల్ చూడసాగాడు. దీంతో మిలిటరీ సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిపై అనుమానించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ వ్యక్తి గురించి దర్యాప్తు చేయగా రొటీన్ మోసగాడు అని తేలింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నివాసి అయిన అతడు 2023 సెప్టెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఒడిశాలోని జువైనల్ హోమ్‌లో ఉన్నాడు. ఫిబ్రవరి 13న విడుదలైన తర్వాత కటక్‌లోని హోటల్ ప్రైడ్‌లో బస చేశాడు. రూ.6,393 చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన ఆ వ్యక్తి మార్చి 14న హౌరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. క్యాబ్‌లో విమానాశ్రయానికి వెళ్లాడు. ఎయిర్పోర్ట్ నుంచి తనను పికప్ చేసేకునేందుకు క్యాబ్ పంపాలని హోటల్ జేడబ్ల్యూ మారియట్‌కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఆ హోటల్లో బస చేశాడు.
ఆ తర్వాత అతడు హోటల్ నుంచి బీఎండబ్ల్యూ క్యాబ్‌ను బుక్ చేశాడు. రాష్ట్రపతి బాడీగార్డ్ రెజిమెంట్‌తో ఎంప్యానెల్ అయిన ఆర్మీ అధికారినని డ్రైవర్‌కు చెప్పాడు. నమ్మిన క్యాబ్ డ్రైవర్, డిఫెన్స్ కోటా కింద తన కుమార్తెను జాదవ్‌పూర్ యూనివర్సిటీలో చేర్పించాలని కోరాడు. దీంతో వారిద్దరూ ఆ యూనివర్సిటీకి వెళ్లారు. ఆ తర్వాత ఫార్మాల్టీల కోసం కోల్‌కతాలోని ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ అయిన ఫోర్ట్ విలియంకు చేరుకున్న అతడ్ని సెక్యూరిటీ సిబ్బంది అనుమానించారు. కోల్‌కతా పోలీసులకు అప్పగించారు.
కాగా, ఆ మోసగాడు తప్పుడు డిజిటల్ చెల్లింపులతో పలు లగ్జరీ హోటళ్లు, షాపులను మోసం చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కానిస్టేబుల్ సునీల్ కుమార్ పేరుతో ఉన్న ఐడీ కార్డుతో కటక్, కోల్‌కతాలోని హోటళ్లలో బస చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అలాగే బీటెక్ విద్యార్థిగా అతడు చెప్పాడని, అయితే దీని గురించి స్పష్టత లేదని పోలీసులు వెల్లడించారు. ఆ వ్యక్తి మోసాలపై దర్యాప్తు చేస్తున్నారు.