బెంగళూరు, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన దిగుమతి విధానం కర్ణాటక రాష్ట్ర వక్క రైతుల పాలిట శాపంగా మారింది. కేవలం రెండు నెలల వ్యవధిలో క్వింటాలు వక్క ధర దాదాపు రూ.15 వేల వరకూ పడిపోయింది. వర్షాల కారణంగా ఇప్పటికే పంట నష్టపోయిన వక్క రైతులపై గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా ఇప్పుడు వక్క ధరలు తగ్గిపోవడంతో ఆర్థికంగా మరింత కుంగిపోయారు. దక్షిణాసియా దేశాల మధ్య కుదిరిన సహకార ఒప్పందం నుంచి లబ్ధి పొందేందుకు భూటాన్ నుంచి వక్కల్ని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం కొన్ని సంస్థలకు అనుమతి ఇవ్వటం దీనికి కారణమని వక్క రైతుల సంఘం అధ్యక్షుడు బీఏ రమేశ్ హెగ్డే తెలిపారు. భూటాన్ నుంచి దిగుమతులను అనుమతించొద్దని కేంద్రాన్ని కోరినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సెప్టెంబరులో రూ.58 వేలు పలికిన క్వింటాలు వక్క ధర అక్టోబరులో రూ.50 వేలకు పడిపోయింది. ఆ తర్వాత ప్రతి వారమూ ధర పడిపోతూ ప్రస్తుతం రూ.39 వేలకు తగ్గింది.
2014-15లో క్వింటాలు వక్క ధర దాదాపు రూ.లక్ష పలికి రికార్డు సృష్టించింది. అనంతర కాలంలో ఈ ధర పతనమవుతూ.. గత నాలుగేండ్లుగా రూ.50-60 వేల మధ్య ఊగిసలాడింది. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం వక్కల్లో 50 శాతం కర్ణాటకలోనే పండుతున్నది. గుజరాత్, మహారాష్ర్ట, ఢిల్లీలోని పాన్ మసాల వ్యాపారులు కర్ణాటక నుంచి భారీగా వక్కల్ని కొంటారు. ఇటీవలి కాలంలో వారు భూటాన్ నుంచి కాస్త తక్కువ ధరకు వక్కల్ని కొంటుండటంతో తమ వక్కలకు గిరాకీ పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూటాన్ నుంచి దిగుమతి నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.