న్యూఢిల్లీ: వందేమాతం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ ఉత్సవంలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. వందే మాతరం గీతంలోని కొన్ని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించినట్లు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మోదీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. విభజనకు చెందిన కొన్ని చరణాలను ఆ గేయం నుంచి తొలగించారని, ఇప్పటికీ లాంటి విభజన మైండ్‌సెట్ దేశానికి సవాల్‌గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం 150 ఏళ్లకు చెందిన సంస్మరణ స్టాంపు, నాణాన్ని ప్రధాని రిలీజ్ చేశారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం ఈ దేశ స్వరంగా మారిందన్నారు. ప్రతి భారతీయుడి తమ మనోభావాలను ఆ గేయం ద్వార వ్యక్తపరిచారన్నారు. కానీ 1937లో దురదృష్టవశాత్తు, వందేమాతరం గేయంలోని కొన్ని చరణాలను తొలగించారని, వందేమాతర గీత విభజన దేశ విభజనకు బీజం వేసిందన్నారు. జాతి నిర్మాణం కోసం రూపొందించిన ఈ మహామంత్రం పట్ల ఎందుకు అన్యాయం జరిగిందో ఈ తరం యువత తెలుసుకోవాలన్నారు. ఇలాంటి విచ్చిన్నకర మైండ్‌సెట్ దేశానికి ఇప్పటికీ సవాలే అన్నారు. ఉగ్రవాదం పేరుతో శత్రవులు మన భద్రత, గౌరవంపై దాడి చేస్తే, అప్పుడు భారత్ ఎలా దుర్గ అవతారాన్ని ఎత్తిందో ప్రపంచ వీక్షించినట్లు పేర్కొన్నారు. వందేమాతర గీతం కొత్త స్పూర్తిని ఇస్తుందని, ఈ దేశాన్ని కొత్త శక్తితో నింపుతోందన్నారు.
వందేమాతరం అంటే ఓ పదం, ఓ మంత్రం, ఓ శక్తి, ఓ కళ, ఓ పట్టుదల అని ఆయన అన్నారు. భారతమాత పట్ల ఇది భక్తికి నిదర్శనమన్నారు. మన చరిత్రను చాటుతూ.. మనకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. అనుకున్నది సాధించలేనిది ఏమీ లేదని, భారతీయులు దేన్నైనా సాధించగలరని, జ్ఞానం..విజ్ఞానం.. సాంకేతిక నిండిన దేశాన్నినిర్మించాలన్నారు.