OPT | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : అమెరికాలోని కంపెనీల్లో కీలక పదవుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు అనుమతించే హెచ్-1బీ వీసాలపై అగ్రరాజ్యంలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హెచ్-1బీ వీసా విధానంలో పలు కీలక సంస్కరణలు తీసుకురానున్నారు. ఈ క్రమంలో హెచ్-1బీ వీసాల జారీపై ట్రంప్ పార్టీలోని నేతలే రెండువర్గాలుగా చీలి తమ డిమాండ్లను బహిరంగంగానే వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
హెచ్-1బీ వీసాల పేరిట కొత్తగా విదేశీ ఉద్యోగులను ఇక్కడకు తీసుకురావాల్సిన అవసరం లేదని ట్రంప్ క్యాంప్‌నకు చెందిన మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) నేటివిస్టులు చెప్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రాంలో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతున్నారు. ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏమిటీ ఓపీటీ?
అమెరికాలో వృత్తిపరమైన అనుభవం కోసం విదేశీ విద్యార్థులు ఎఫ్-1 వీసాలపై అందుకునే శిక్షణను ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)గా చెప్తున్నారు. 1947లో ప్రారంభించిన ఈ ఓపీటీ ప్రోగ్రామ్ సాయంతో విదేశీ విద్యార్థులు మొదటి విద్యా సంవత్సరం తర్వాత ఏడాదిపాటు ఓపీటీలో కొనసాగవచ్చు. ఈ సమయంలో తాత్కాలికంగా ఉద్యోగాలూ చేయవచ్చు. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ చేసిన వారు డిగ్రీ పూర్తయ్యాక మూడేండ్ల వరకూ అమెరికాలో ఉండి ఓపీటీ ద్వారా పని అనుభవం పొందే వీలు ఉంటుంది. ఇదే సమయంలో ఉద్యోగమూ చేయవచ్చు. దీంతో ఓపీటీ పేరిట అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులు ఇక్కడ ఉద్యోగంలో చేరడంతో పాటు హెచ్-1బీ వీసా పొందడానికి దీన్ని ఒక సాధనంగా మార్చుకొంటున్నారని మాగా నేటివిస్టులు ఆరోపిస్తున్నారు. ఓపీటీ ప్రోగ్రాం వ్యవధి ముగిసేలోగా హెచ్-1బీ వీసాలకు మారడం, గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేస్తూ ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకొంటున్నారని ఆరోపిస్తున్నారు.
నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎక్కడున్నా.. వారిని ప్రోత్సహించాల్సిందేనని ట్రంప్ కార్యవర్గంలోని మరో గ్రూప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డీఓజీఈ) నేతలు చెప్తున్నారు. ఈ జాబితాలో ట్రంప్ సలహాదారులుగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులు ఉన్నారు. ఓపీటీ విధానంతో వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్-1బీ వీసా విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఓపీటీ ప్రోగ్రామ్‌ను రద్దు చేసినా, హెచ్-1బీ వీసాల్లో కోత విధించినా భారత్, చైనాలోని టెకీలకు, విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు.