న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్‌కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేయడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుక్రవారం ఆమోదం తెలిపింది. పాక్ ప్రధాని కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. ఐఎంఎఫ్ బోర్డు సమావేశం శుక్రవారం వాషింగ్టన్లో జరిగింది. పాక్‌కు ఉద్దీపన ప్యాకేజీపై జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. గతంలో ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడంలో, ఐఎంఎఫ్ షరతులను పాటించడంలో పాకిస్థాన్ పదేపదే విఫలమవుతున్నదని తెలిపింది.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు అందచేస్తున్న రుణాలు సైనిక నిఘా కార్యకలాపాలకు, భారత భూభాగంపై దాడులు నిర్వహించిన లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర గ్రూపులకు పరోక్షంగా సాయపడుతున్నాయని భారత్ మొదటినుంచి వాదిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోనంత వరకు పాకిస్థాన్‌కు ఆర్థిక సహకారం అందచేయవద్దని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు విజ్ఞప్తి చేస్తోంది.