New Delhi : దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు చేరింది. మోకాలి లోతులో వరద నీరు నిలిచిపోయింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును కూడా వరద నీరు ముంచెత్తింది.
దీంతో విమానాల రాకపోలకు ఇబ్బంది ఎదురవుతోంది. సగటున విమానాలు 17 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాయంత్రం రావాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఎయిర్పోర్టులో నీరు చేరిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఈశాన్య మధ్యప్రదేశ్లో అల్పపీడన ద్రోణి కారణంగా సెంట్రల్ ఇండియాలో వర్షాలు కురుస్తున్నాయి.
ఢిల్లీలోని రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.7 డిగ్రీలుగా ఉంది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతంతో పోలిస్తే ఢిల్లీలో వర్షపాతం ఎక్కువగానే నమోదైంది. ఢిల్లీలో 354.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతంకంటే 120 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.