బెంగళూరు: ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్, కర్ణాటక రాజధాని బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల ఇక్రా జీవని అనే యువతి, గేమింగ్ యాప్ ద్వారా అతడికి పరిచయమైంది. ప్రేమలో పడిన వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఇక్రా జీవని పాకిస్థాన్ నుంచి నేపాల్ చేరుకుంది. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం నేపాల్, భారత్ సరిహద్దును అక్రమంగా దాటి బీహార్‌కు చేరుకున్నారు.
కాగా, తాను పని చేస్తున్న బెంగళూరుకు ఇక్రాను యాదవ్ తీసుకొచ్చాడు. జున్నసంద్ర ప్రాంతంలోని అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు. ఇక్రా జీవని పేరును రవా యాదవ్‌గా మార్చాడు. తన భార్యగా పేర్కొంటు ఆధార్ కార్డు కూడా సంపాదించాడు. ఆ తర్వాత ఆమె భారత పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళపై ఏమైనా కేసులు ఉన్నాయా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని తన తల్లిదండ్రులతో ఆ యువతి మాట్లాడుతున్న విషయం ఇంటెలిజెన్స్ అధికారులకు తెలిసింది. దీంతో వారు బెంగళూరు పోలీసులను అలెర్ట్ చేశారు.
మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ఆధారంగా బెంగళూరు పోలీసులు వారి ఇంటిపై రైడ్ చేశారు. అక్రమంగా నివసిస్తున్న పాక్ యువతి ఇక్రా, ఆమెను పెళ్లి చేసుకున్న భర్త యాదవ్‌ను అరెస్ట్ చేశారు. పాక్ జాతీయురాలైన ఆ యువతిని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం అధికారులకు అప్పగించారు. పాక్ యువతి, ఆమె భర్త యాదవ్‌తోపాటు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానిపై కూడా విదేశీయుల చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.