న్యూఢిల్లీ: కశ్మీర్‌ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. తమ ప్రధాన రక్తం నాళమని పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. (India slams Pak Army Chief’s comment) జమ్ముకశ్మీర్ భారత అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది. పీవోకేను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆక్రమిత భూభాగాలను భారత్‌కు అప్పగించాలని పేర్కొంది.
కాగా, విదేశాల్లో ఉన్న పాకిస్థానీలను ఉద్దేశించి జనరల్ మునీర్ బుధవారం మాట్లాడారు. 1947లో పాకిస్థాన్ పుట్టుకకు దారితీసిన రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆయన సమర్థించారు. జమ్ముకశ్మీర్‌పై కొనసాగుతున్న దీర్ఘకాల వైరాన్ని పునరుద్ఘాటించారు. ‘మా వైఖరి స్పష్టంగా ఉంది. తలకు వెళ్లే ప్రధాన రక్త నాళం ఇది. మేం దానిని మరిచిపోం. వీరోచిత పోరాటంలో మా కశ్మీరీ సోదరులను వదిలిపెట్టబోం’ అని అన్నారు.
మరోవైపు ఇస్లామిక్ రిపబ్లిక్‌గా పాకిస్థాన్ ఆర్భావం గురించి జనరల్ అసిమ్ మునీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను ఆయన ప్రస్తావించారు. ‘హిందువుల కంటే మనం భిన్నమని మన పూర్వీకులు నమ్ముతారు. మన మతం వేరు. మన ఆచారాలు వేరు. మన సంప్రదాయాలు వేరు. మన ఆలోచనలు వేరు. మన ఆశయాలు వేరు. రెండు దేశాల సిద్ధాంతానికి ఇదే పునాది. మనం ఒకటి కాదు రెండు దేశాలు అనే నమ్మకంతో ఇది ఏర్పడింది’ అని అన్నారు.
కాగా, ఉన్నతమైన భావజాలం, సంస్కృతితో పాకిస్థానీలు ముడిపడి ఉన్నారని మునీర్ తెలిపారు. దేశ పునాదికి సంబంధించిన చరిత్రను తరువాతి తరానికి అందించాలని విదేశాల్లోని పాకిస్థానీయులను ఆయన కోరారు.