Betting Case | ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు కొనసాగుతున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు నటీనటులను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో పాటు బెంగాల్ నటీ, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది. మిమి చక్రవర్తిని ఈ నెల 15న, ఊర్వశిని ఈ నెల 16న ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావలని ఆదేశించింది. వీరిద్దరూ ప్రముఖ బెట్టింగ్ యాప్ 1xBetకు ప్రచారం చేసినట్టు భావిస్తున్నారు.
ఈ యాప్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రచారంలో తదితర అంశాల్లో వీరిద్దరి పాత్ర ఎంతో తెలుసుకునేందుకు విచారణ అవసరమని ఈడీ విచారణ అవసరమని భావిస్తున్నది. ఇంతకు ముందు ఇదే కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్‌సింగ్, యువరాజ్‌సింగ్, సురేశ్ రైనాలను సైతం ఈడీ విచారించింది. శిఖర్ను ఈ నెల 4న ఈడీ ఎనిమిది గంటల పాటు విచారించింది.
సోషల్ మీడియా వేదికగా 1xBetకి ప్రచారం చేసినట్లు ఆధారాలు లభించగా.. ఆ దిశగా ప్రచారం చేసినట్లు ఆధారాలు లభించాయని.. ఈ క్రమంలోనే విచారణ నిర్వహించినట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్‌లోనూ ప్రమోషన్స్ ప్రచారం నిర్వహించిన సినీ ప్రముఖుల పేర్లు వినిపించాయి. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సైతం విచారణకు హాజరయారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రియల్ మనీ ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.