డెహ్రాడూన్, సెప్టెంబర్ 30: లాలాజలంలో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రొటీన్లను ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రొటీన్లు ట్రిపుల్ నావిగేట్ బ్రెస్ట్ క్యాన్సర్ (టీఎన్బీసీ)ను ప్రారంభ దశలోనే గుర్తిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఏటా 1.6 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అందులో 80 వేల మంది చనిపోతున్నారు. మొత్తం కేసుల్లో 10-15 శాతం టీఎన్బీసీవే. ఈ వ్యాధి వచ్చిన రోగులకు హార్మోనల్, హర్-2 ప్రొటీన్లను టార్గెట్ చేసే ఔషధాలు పనిచేయవు. దీన్ని గుర్తించే సరికి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. దీంతో ఆ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే పరీక్షలపై ఐఐటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. కొంతమంది రోగుల లాలాజలాన్ని సేకరించి పరీక్షించారు. అందులోని 3 ప్రొటీన్లు వ్యాధిని పక్కాగా గుర్తిస్తాయని తేల్చారు.
ట్రిపుల్ నావిగేట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే..
సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌లో గుర్తించే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు, హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ (హర్2) ప్రొటీన్ ట్రిపుల్ నావిగేట్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఉండవు.