(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పొడవైన రన్వేలు, భారీ విమానాశ్రయాలు నిర్మించలేని మారుమూల ప్రాంతాల్లోనూ విమానాలను సులభంగా ల్యాండింగ్ చేసే రోజులు త్వరలో రానున్నాయి. విమానాలను నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ (వీటీవోఎల్-వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) చేసే సాంకేతికత అభివృద్ధిలో ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు.
హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్ల ద్వారా వర్చువల్ సిమ్యులేషన్ సాంకేతికత సాయంతో విమానాలను సురక్షితంగా నెమ్మదిగా నిట్టనిలువుగా కిందకు దించేందుకు అవసరమైన వేగాన్ని సాధించగలిగారు. తాజా ప్రయోగంతో భూమిపైనే కాకుండా ఇతర గ్రహాల్లో మానవసహిత, మానవరహిత వ్యోమనౌకలను వెర్టికల్గా టేకాఫ్, ల్యాండింగ్ చేయవచ్చని ప్రొఫెసర్ పీఏ రామకృష్ణ తెలిపారు.