న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యూనివర్సిటీల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026 ద్వారా ప్రకటించింది. ఇందులో భారత్‌కు చెందిన 54 యూనివర్సిటీలకు చోటు దక్కింది. 2014లో కేవలం 11 యూనివర్సిటీలకు మాత్రమే ఈ లిస్టులో కనిపించగా, ఈ సారి వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది.
యూఎస్, యూకే, చైనా తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. కాగా, ఈ సారి 200లోపు ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన యూనివర్సిటీలు మూడే ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ టాప్ 200లో నిలిచాయి. ఐఐటీ ఢిల్లీ గతేడాది సాధించిన 150వ స్థానం నుంచి 123 స్థానానికి ఎగబాకింది. ఐఐటీ బాంబే మాత్రం గతేడాది ర్యాంక్ 118 నుంచి 129వ స్థానానికి చేరుకుంది.
ఇక ఐఐటీ మద్రాస్ 180వ ర్యాంక్ సాధించింది. ఇక యూఎస్‌లోని మాసచెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా పద్నాలుగోసారి మొదటి ర్యాంక్‌ను సాధించింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ రెండోస్థానం, యూఎస్‌లోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ మూడో స్థానంలో నిలిచాయి.