న్యూఢిల్లీ : దోమల వల్ల సోకే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే డిటర్జెంట్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ద్రవం, పొడి రూపాల్లో అందుబాటులో ఉంటుంది. సాధారణ డిటర్జెంట్ల మాదిరిగానే ఇది కూడా బట్టలను శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా, దోమలను పారదోలే రక్షణ పొరను బట్టలపై ఉంచుతుంది.
దోమ కాటు నుంచి ప్రజలను కాపాడే ఉత్పత్తిని అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలన్న లక్ష్యంతో ఈ డిటర్జెంట్‌ను తయారు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. మూడేళ్లపాటు శ్రమించి దీనిని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ దశలో ఉందన్నారు.