Health tips : జీవి శరీరంలో అవయవాల్లో కాలేయం (Liver) చాలా ముఖ్యమైనది. ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో, రక్త సరఫరాను మెరుగుపర్చడంలో, శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకొని శరీరానికి అందిస్తుంది. ఈ విధంగా జీవక్రియల్లో లివర్ది కీలక పాత్ర. కాబట్టి మనం లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాలేయం మన శరీరంలో 500 రకాలకు పైగా జీవ క్రియలను నిర్వహిస్తుంది. అయితే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కొన్ని సందర్భాల్లో కాలేయం డామేజ్ అవుతుంది. అయితే కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
పాలకూర, మెంతికూర, కొత్తిమీర లాంటి ఆకు కూరలను తీసుకుంటే లివర్ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే బ్లూ బెర్రీలు, స్ట్రా బెర్రీలు లాంటి బెర్రీ పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాలేయాన్ని డ్యామేజ్ కాకుండా చూస్తాయి. లివర్ వాపును కూడా తగ్గిస్తాయి. దాంతో లివర్ పని తీరు మెరుగు పడుతుంది. మనం తినే ఆహారంలోని పోషకాలను లివర్ సరిగ్గా శోషిస్తుంది.
అల్లనేరేడు పండ్లు కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయం చేస్తాయి. నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే గ్రేప్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్, ఉసిరికాయ జ్యూస్, అలోవెరా జ్యూస్ కూడా తాగవచ్చు. ఇవన్నీ లివర్‌కు ఎంతగానో మేలు చేస్తాయి. లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. కానీ నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది.
కనుక నాన్ వెజ్‌ను తక్కువగా తీసుకోవాలి. అయితే చేపలను ఎక్కువగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంవల్ల కూడా లివర్ పనితీరు మెరుగుపడుతుంది. లివర్ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు. రోజూ పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే లివర్ వ్యాధులు తగ్గుతాయి.
రోజూ రాత్రిపూట పాలలో కొంచెం పసుపు కలిపి తాగితే లివర్ పనితీరు మెరుగుపడుతుంది. రోజూ తగినంత నీళ్లు తాగడం వల్ల కూడా లివర్ పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. ఈ విధంగా పలు చిట్కాలను పాటిస్తే లివర్‌ను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దాంతో లివర్ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.