Fake Brands | న్యూఢిల్లీ, జూన్ 24: నేడు మార్కెట్లో ఎక్కడ చూసినా బట్టలు, బ్యాగుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, షూలు, వాటి సాక్సుల వరకు పూమా, అడిడాస్, నైకీ వంటి బడా బ్రాండ్ల పేరుతో నకిలీ ప్రొడక్టులు విపరీతంగా దర్శనమిస్తుంటాయి. మన దేశంలో స్వల్ప మార్పులతో ఇలాంటి ఫేక్ బ్రాండ్ వస్తువులను అమ్మడం లేదా కొనడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఇలాంటి నకిలీ బ్రాండ్ వస్తువులను అమెరికా తీసుకెళ్లాలనుకొంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. తాము వాడుకొనేందుకు తెచ్చుకొన్నామని మొత్తుకున్నా.. అమెరికా కస్టమ్స్ అధికారులు విమానాశ్రయాల్లోనే తనిఖీల్లో భాగంగా చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడినా, వాదించినా కేసు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో భారత్‌కు చెందిన పలువురికి ఇలాంటి పరిస్థితి ఎదురైందని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.
అమెరికాలో నకిలీ వస్తువులు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఐపీఆర్) నిబంధనలకు విరుద్ధం. ఫేక్ వస్తువులతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తున్న నేపథ్యంలో అక్కడి కస్టమ్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకొంటున్నారు. ఆ దేశంలో గత ఏడాది 19,724 షిప్మెంట్ల నుంచి 2.3 కోట్ల ఫేక్ బ్రాండ్ వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. దీంతో అమెరికా అధికారులు నకిలీ వస్తువుల స్మగ్లింగ్‌పై నిఘా పెంచారు. విమానాశ్రయాల్లో, సముద్రాల్లోని పోర్టు ప్రవేశాల వద్ద తనిఖీలు పెంచారు.
ఈ తనిఖీల్లో ఎక్కువగా పెద్ద బ్రాండ్ పేర్లతో బట్టలు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి నకిలీ వస్తువులను తీసుకెళ్తున్న భారతీయ విద్యార్థులు, ప్రయాణికులే ఎక్కువగా పట్టుబడుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. అయితే అవి అమ్మేందుకు కాదని, తాము వాడుకోవడానికి అని ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదు. వాటిని స్వాధీనం చేసుకొంటున్నారు. ప్రశ్నించిన వాళ్లను.. కేసు నమోదు చేసి, జైల్లో పెడుతామని హెచ్చరిస్తున్నారని రిపోర్టు పేర్కొన్నది.